మీ పాస్‌వర్డ్ సేఫ్ గానే ఉందొ లేదో చెక్ చేసుకోండి...!!


కంప్యూటర్ లేదా మొబైల్ డివైస్ అకౌంట్, ఈ-మెయిల్, ఆన్‌లైన్ సైట్లు… ఇలా చెప్పుకుంటూ పోతే టెక్ ప్రపంచంలో యూజర్లకు తరచూ ఎదురయ్యే పదాలు ‘లాగిన్ ఐడీ/యూజర్ నేమ్, పాస్‌వర్డ్’. లాగిన్ ఐడీ లేదా యూజర్ నేమ్‌లను ఏ విధంగా సెట్ చేసుకున్నా పాస్‌వర్డ్ మాత్రం చాలా బలమైందిగా ఉండాలని సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతారు. వారే కాదు యూజర్లు ఏ అకౌంట్‌లోనైనా పాస్‌వర్డ్ చేసుకునే సమయంలో సంబంధిత సేవలను అందించే సంస్థలు కూడా పాస్‌వర్డ్ కోసం ఉపయోగించే పదాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో అప్పటికప్పుడే తెలియజేస్తాయి. దానికి అనుగుణంగా యూజర్లు తమకు అనువుగా ఉండే విధంగా సులభమైన, బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకుంటారు. ఇలా చేయకపోతే అకౌంట్లకు భద్రతా పరమైన ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉండడమే కాక, హ్యాకర్ల బారిన పడితే ఇక అంతే సంగతులు. అనంతరం విచారించినా ఫలితం ఉండదు.

అయితే మరి బలమైన పాస్‌వర్డ్‌ల మాట అటుంచితే ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది యూజర్లు వాడుతున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఏవి? వాటిలో మొదటి స్థానం ఏ పాస్‌వర్డ్‌కు దక్కింది? ఇది తెలుసుకోవాలంటే ‘స్ల్పాష్‌ డేటా సాఫ్ట్‌వేర్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ‘అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల’ జాబితాను ఓ సారి చూడాల్సిందే.

పాస్‌వర్డ్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏటా అధిక సంఖ్యలో యూజర్లు వాడే అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను స్ల్పాష్‌ డేటా సాఫ్ట్‌వేర్ సంస్థ విడుదల చేస్తుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ సంస్థ అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాను 2015 సంవత్సరానికి గాను ప్రకటించింది. ఇందుకోసం వారు దాదాపు 1 కోటి మందిని సర్వే చేశారు. అనంతరం వచ్చిన సర్వే ఫలితాలను విశ్లేషించి యూజర్లు ఎక్కువగా వాడుతున్న ‘టాప్ 25 చెత్త పాస్‌వర్డ్‌ల’ జాబితాను విడుదల చేశారు.

కాగా స్ల్పాష్‌ డేటా సాఫ్ట్‌వేర్ విడుదల చేసిన ఈ చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘123456’ అనే పాస్‌వర్డ్ పదం వరుసగా 3వ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. దీని తరువాత స్థానంలో ‘PASSWORD’ అనే పదం చేరింది. ఇది కూడా వరుసగా 3వ సారి 2వ స్థానంలో నిలిచింది. తరువాత వరుసగా ‘12345678, QWERTY, 12345, 123456789’ పాస్‌వర్డ్ పదాలు ఆ జాబితాలో స్థానం పొందాయి.

స్ల్పాష్‌ డేటా సాఫ్ట్‌వేర్ విడుదల చేసిన అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో మొదటి 25 స్థానాల్లో నిలిచిన పాస్‌వర్డ్‌లు ఇవే…


123456, PASSWORD, 12345678, QWERTY, 12345, 123456789, FOOTBALL, 1234, 1234567, BASEBALL, WELCOME, 1234567890, ABC123, 111111, 1QAZ2WSX, DRAGON, MASTER, MONKEY, LETMEIN, LOGIN, PRINCESS, QWERTYUIOP, SOLO, PASSW0RD, STARWARS



చూశారుగా! అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల లిస్ట్‌ని. వీటిలో ఏ పదాలనైనా మీరు పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తున్నారా? అయితే వెంటనే మార్చేసేయండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నంబర్ వచ్చే విధంగా ఆయా ఆకౌంట్లకు పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోండి. ఇవి పూర్తిగా కాకపోయినా ‘చెత్త పాస్‌వర్డ్‌ల’ కన్నా మెరుగైన భద్రతను అందిస్తాయి.
Previous
Next Post »